YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు: సిట్ విచారణ పూర్తవుతోంది, సీబీఐ దర్యాప్తు అవసరంలేదన్న ఏజీ
- వివేకా హత్యకేసు సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు
- పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు
- కేసు డైరీ అప్పగించాలని ఏజీని ఆదేశించిన న్యాయస్థానం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
ఎన్నికల ముందు పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికీ నిందితులెవరన్నది తేలనేలేదు. దీనిపై సిట్ విచారణ జరుగుతుండగా, కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
వివేకా హత్య కేసులో ఏర్పాటైన సిట్ విచారణ త్వరలోనే పూర్తికాబోతోందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరంలేదని అన్నారు. ఈ సందర్భంగా సిట్ విచారణ నివేదికను ఏజీ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ తీరుతెన్నులను కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం లోగా కేసు డైరీ, ఇతర కీలక ఫైళ్లను తమకు అందించాలని ఏజీని న్యాయమూర్తి ఆదేశించారు.