Nara Lokesh: బీసీ నిధులపై గళమెత్తినందుకు ఇప్పుడు అచ్చెన్నాయుడుపై పడ్డారు: నారా లోకేశ్
- అచ్చెన్నకు అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారన్న లోకేశ్
- బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ విమర్శలు
- దొంగ పేపర్, దొంగ చానల్ ట్రాప్ లో పడొద్దంటూ హితవు
బీసీ నిధులను తుగ్లక్ పక్కదారి పట్టించారని ఎలుగెత్తినందుకు అచ్చెన్నాయుడుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బీసీల పరిస్థితి పట్ల ప్రశ్నించాడని ఇప్పుడు బీసీ నాయకుడిపై పడ్డారని మండిపడ్డారు. మందులు, వస్తువుల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు ఎలాంటి లేఖలు రాయలేదని ఆధారాలు ఉన్నా, లీక్ వార్తలతో ఏదో సాధించాలని దొంగ పేపర్, దొంగ చానల్ తాపత్రయపడుతున్నాయని విమర్శించారు.
ఆ మీడియా అంత ఆరాటపడడంలో తప్పులేదని, ఎందుకంటే రూ.10 షేర్ రూ.1440కి అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించారు. కానీ మిగతా వాళ్లు క్విడ్ ప్రోకో వార్తల ట్రాప్ లో పడితే ఉన్న విలువ పడిపోతుందని తెలిపారు. "దొంగ పేపర్, దొంగ చానల్ ట్రాప్ లో పడి మీ పరువు తీసుకోకండి. మొదట రూ.2 వేల కోట్లు అని అందరినీ తప్పుదోవ పట్టించారు. ఉన్నది రూ.2 లక్షలే అని తెలియడంతో ఇప్పుడు నాలుక్కరుచుకున్నారు" అంటూ వరుస ట్వీట్లు చేశారు.