- విద్యా భారతి, శిశుమందిర్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్
- వాటిలో క్రిస్టియన్లు కూడా పెద్ద సంఖ్యలోచదువుతున్నారు.
- యూపీలోని ఈ స్కూళ్లలో హిందుయేతర స్టూడెంట్లు 12వేల మందికిపైగానే..
- ఏటా మరింతగా పెరుగుతున్నారన్న నిర్వాహకులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యా భారతి పేరిట నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం స్టూడెంట్లు చదువుతున్నారు. కొందరు క్రిస్టియన్లు కూడా ఈ స్కూళ్లలో చదువుతున్నారు. అంతేకాదు ఏటా వారి సంఖ్య ఇంకా పెరుగుతోందని, గత మూడేళ్లలోనే 30 శాతం పెరిగిందని విద్యా సంస్థల నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు విద్యా భారతి స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం టీచర్లు కూడా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
హిందూ ధర్మమే కాదు.. నాణ్యమైన విద్య కూడా..
సాధారణంగా ఆర్ఎస్ఎస్ అంటే హిందూత్వ భావజాలాన్ని, హిందూ ధర్మాలను, సంప్రదాయాలను ప్రోత్సహిస్తుంటుంది. తమ స్కూళ్లలోనూ ఈ తరహాలో బోధన ఉంటుందని విద్యాభారతి అడిషనల్ సెక్రటరీ చింతామణి సింగ్ చెప్పారు. అయితే నాణ్యమైన విద్య అందిస్తామని, విద్యార్థులపై వివక్ష చూపడం అనేదే ఉండదని తెలిపారు. అందువల్లే ముస్లింలు, క్రిస్టియన్లు పిల్లలను విద్యా భారతి స్కూళ్లలో చేర్పిస్తున్నారని వెల్లడించారు.
మూడేళ్లలో 30 శాతం పెంపు
ఉత్తర ప్రదేశ్ లో విద్యా భారతి, సరస్వతీ శిశు మందిర్, సరస్వతీ విద్యా మందిర్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థుల సంఖ్య 30 శాతం పెరిగిందని చింతామణి సింగ్ తెలిపారు. యూపీలోని తమ స్కూళ్లలో దాదాపు 12 వేల మంది ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారు. వారు శ్లోకాలు, భోజన మంత్రాలు కూడా నేర్చుకుంటున్నారని.. స్కూళ్లలో నిర్వహించే క్రీడా పోటీల్లో ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. తమ విద్యార్థులు మహ్మద్ అఫ్సర్, మహమ్మద్ సుభాన్.. ఇటీవల జరిగిన ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ అండర్–17 కేటగిరీలో గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు.