Amaravati: అమరావతి పీఎస్ వద్ద మహిళా జేఏసీ ఆందోళన... పరిస్థితి ఉద్రిక్తం
- అమరావతి మహిళా జేఏసీ బస్సు యాత్ర
- అడ్డుకున్న వైసీపీ నేతలు
- నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారంటున్న మహిళలు
తాడికొండ మండలంలో మహిళా జేఏసీ నేతలు ప్రయాణిస్తున్న బస్సును వైసీపీ నేతలు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బస్సులోంచి ఎవరూ కిందికి రాకుండా బస్సు డోర్ కు వాటర్ డ్రమ్ములు అడ్డుపెట్టారు. బస్సులో ఉన్నవారిపై కారం కూడా చల్లినట్టు తెలుస్తోంది. దీనిపై మహిళా జేఏసీ నేతలు అమరావతి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై దాడి చేసింది ఎంపీ నందిగం సురేశ్ అనుచరులని వారు ఆరోపిస్తున్నారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఆందోళనతో అమరావతి పీఎస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. జై అమరావతి నినాదాలతో వారు హోరెత్తిస్తున్నారు. జేఏసీ మహిళలకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు పలికారు. కాగా, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, విజయవాడ మాజీ మేయర్ గద్దె అనురాధలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.