Egypt: మూడు దశాబ్దాలపాటు ఈజిప్టును శాసించిన హోస్నీ ముబారక్ కన్నుమూత
- 1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ముబారక్
- అమెరికాకు అత్యంత సన్నిహితుడిగా పేరు
- 2011లో పదవీచ్యుతుడిని చేసిన సైన్యం
మూడు దశాబ్దాలపాటు ఈజిప్టును తన కనుసైగలతో శాసించిన హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. 1981 నుంచి 2011 వరకు 30 ఏళ్లపాటు ఈజిప్టు అధ్యక్షుడిగా పనిచేసిన ముబారక్.. అమెరికాతో సన్నిహితంగా మెలిగారు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు.
ముబారక్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా 2011లో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో 900 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలు మరింత ఉద్ధృతం కావడంతో సైన్యం రంగంలోకి దిగింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న ముబారక్‌ను పదవీచ్యుతుడిని చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
దేశంలో 18 రోజులపాటు నిరసనలు జరిగి, వందలాది మంది మరణించినా నిలువరించలేకపోయారంటూ జూన్ 2012లో ముబారక్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండేళ్ల తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును కొట్టివేసింది. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకు, ఇద్దరు కుమారులకు మాత్రం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఆయన రెండేళ్ల క్రితమే విడుదలయ్యారు.