indian air force: సరిహద్దు దాటేందుకూ వెనుకాడేది లేదు: రాజ్‌నాథ్
- ఉగ్రవాద నిర్మూలనలో భారత్ పంథా మారింది
- ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు ఆర్మీ సరిహద్దు దాటుతుంది
- బాలాకోట్ ఉగ్రస్థావరంపై వాయుసేన దాడి చేసి నేటికి ఏడాది
- వాయుసేన ధైర్య సాహసాలను పొగిడిన రక్షణ మంత్రి
ఉగ్రవాద నిర్మూలనలో భారత్ అనుసరించే విధానం మారిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశానికి కీడు తలపెట్టాలనుకునే ఉగ్రమూకలను అంతం చేసేందుకు మన సైన్యం ఇప్పుడు సరిహద్దు దాటి మరీ దాడి చేసేందుకు ఏ మాత్రం వెనుకాడబోదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడులు చేసి నేటికి ఏడాది అయిన సందర్భంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బాలాకోట్‌పై దాడి సందర్భంగా ఎనలేని ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు నా సెల్యూట్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మా ప్రభుత్వం.. గత పాలకుల కంటే భిన్నమైన విధానాన్ని అనుసరిస్తోంది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇప్పుడు సరిహద్దు దాటేందుకు కూడా మనం వెనుకాడడం లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత పంథాలో మార్పు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్, గతేడాది బాలాకోట్‌పై ఎయిర్ స్ట్రయిక్స్ ఈ మార్పునకు నిదర్శనం. ఇది నూతన భారత దేశం’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.