BJP: కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరం.. ఒవైసీ మరో జిన్నా: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- ఒవైసీ సోదరులను అదుపు చేయడంలో కేసీఆర్ విఫలం
- సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను మజ్లిస్ రెచ్చగొడుతోంది
- ఉద్దేశ పూర్వకంగానే ఢిల్లీ అల్లర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్ కోరడం దురదృష్టకరమని అన్నారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయడంలో వారిద్దరూ విఫలమయ్యారని, వారిని కాపాడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందన్న లక్ష్మణ్.. అసదుద్దీన్ ఒవైసీని మరో జిన్నాగా అభివర్ణించారు.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే ఢిల్లీలో అల్లర్లకు తెరలేపారని, మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకు ఆయన వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. భారత్, అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.