Chandrababu: చంద్రబాబు నేటి విశాఖ ర్యాలీకి అనుమతి నిరాకరణ.. ఇతర కార్యక్రమాలకు పలు షరతులు!

Visakha police rejects TDP leaders plea for rally

  • అనుమతి కోసం రెండు రోజులుగా పోలీసుల చుట్టూ తిరిగిన నేతలు
  • చంద్రబాబు వెంట 50 మందికి మించి నాయకులు ఉండకూడదని షరతు
  • మండిపడుతున్న టీడీపీ నేతలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ టీడీపీకి నిరాశే ఎదురైంది. విజయనగరం జిల్లాలో చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో పెందుర్తిలో ఆగి భూసమీకరణ బాధితులతో మాట్లాడతారని ఇప్పటికే టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం 9 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ చంద్రబాబుకు స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. ర్యాలీకి అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తెలిపారు.

అనుమతి కోసం పోలీసులు తమను తిప్పించుకున్నారని నేతలు ఆరోపించారు. నిన్న ఉదయం డీసీపీ-1 రంగారెడ్డిని కలిస్తే మధ్యాహ్నం వరకు ఉంచి అనుమతులు తమ పరిధిలో లేవని, డీసీపీ-2ను కలవాలని చెప్పారని, గాజువాక వెళ్లి డీసీపీ-2 ఉదయ్ భాస్కర్‌‌ను కలిస్తే కమిషనర్‌ను కలవమన్నారని తెలిపారు.

దీంతో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత కలిసి కమిషనర్ ఆర్కే మీనా నివాసానికి వెళ్లారు. రాత్రి 9 గంటల వరకు వేచి చూసి మీనా వచ్చాక అనుమతులు కోరారు. ర్యాలీకి అనుమతి ఇవ్వని కమిషనర్.. ఇతర కార్యక్రమాలకు మాత్రం కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వెంట 50 మందికి మించి నాయకులు ఉండకూడదని, ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉపయోగించకూడదని ఆంక్షలు విధించారు.

కమిషర్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటామని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని ఎమ్మెల్యే గణేశ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News