- అమెరికాలో ఇప్పటికే 60 మందికి వైరస్
- పార్టీలు, జనం గుమిగూడే కార్యక్రమాలు వద్దని ఆ దేశ హెల్త్ డిపార్ట్ మెంట్ హెచ్చరిక
- వివిధ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా వైరస్ వ్యాప్తి గురించి పెద్దగా భయపడాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైరస్ దాడి పెరిగేందుకు కొంతవరకూ అవకాశం ఉందని, కానీ నియంత్రించలేనిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే చైనా నుంచి అమెరికాకు రాకపోకలను నిషేధించామని.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియాలకూ ఈ ఆంక్షలు పెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు.
యూఎస్ లో ఇప్పటికే 60 మందికి కరోనా
ఇటీవల అమెరికా హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన సూచనలకు వ్యతిరేకంగా ట్రంప్ కామెంట్లు ఉండటం గమనార్హం. అమెరికాలో ఇప్పటికే 60 మందికి కరోనా సోకిందని.. పార్టీలు, జనం ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలు చేపట్టవద్దని యూఎస్ హెల్త్ డిపార్ట్ మెంట్ కొన్ని రోజుల కిందటే ప్రకటించింది.
వేల మంది మరణించారు..
ఇప్పటికే చైనాలో 78 వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 2,700 మందికిపైగా మరణించారు. చైనా బయట కూడా సుమారు 30 దేశాల్లో 3,600 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు అధికారికంగా 50 మరణాలు నమోదయ్యాయి. సౌదీ అరేబియా అయితే ఏకంగా పర్యాటకుల రాకను నిషేధించింది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
చైనాలో తగ్గుతున్నా..
వైరస్ ఆవిర్భావానికి మూల కేంద్రమైన చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా.. చైనా అవతల వివిధ దేశాల్లో మాత్రం కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయ్ ల్యాండ్, మలేసియా, సింగపూర్ దేశాల్లో అలర్ట్ ప్రకటించారు.