Chandrababu: నేను ప్రజలతో మాట్లాడితే బండారం బయటపడుతుందని వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి: చంద్రబాబు
- వైజాగ్ లో తనను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం
- తనకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితేంటన్న బాబు
- డబ్బులిచ్చి రాళ్లు, చెప్పులు వేయించారని ఆరోపణలు
వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద తనను వైసీపీ శ్రేణులు నిలువరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజలతో మాట్లాడితే బండారం బయటపడుతుందని వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రశాంతమైన నగరం అని, కానీ ఈ నగరాన్ని వైసీపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
"40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 25 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. ప్రతిపక్ష నాయకుడిగా ఇది పదకొండో సంవత్సరం. దేనికి నన్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. కాగితంపై రాసి ఇవ్వండి. మీరు పోలీసులో కాదో ఎవరికి తెలుసు? నన్ను ఏ చట్టం కింద వెళ్లిపొమ్మని చెబుతున్నారు? పోలీసులు ఉద్యోగం కోసం కక్కుర్తి పడొద్దు. ఇక్కడున్న పోలీసుల వద్ద ఒక్కరికీ ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ లేకుండా ఉద్యోగాలు చేయాల్సినంత పిరికితనం ఎందుకు?
నేను జనం కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాను. కానీ వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకువచ్చి మాపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు వేయించారు. నన్నే బెదిరించాలని చూస్తున్నారంటే ఇక మీడియా, సామాన్యుల పరిస్థితి ఏంటి? చెరువు కబ్జా జరిగిందంటే చూడ్డానికి వెళుతున్నాం, మీకెందుకు భయం?" అంటూ నిలదీశారు.
తనను ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగి వెళ్లేది లేదని, అనుమతి తీసుకునే వచ్చానని ఉద్ఘాటించారు. ఓవైపు చంద్రబాబు మీడియాతో ఆవేశంగా మాట్లాడుతుండగా, మరోవైపు జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.