New Delhi: దుకాణాలు తెరుచుకున్నాయి.. ఢిల్లీలో మెరుగుపడిన పరిస్థితులు
- తెరుచుకున్న కొన్ని దుకాణాలు
- కొనసాగుతున్న భారీ బందోబస్తు
- హింస జరిగిన ప్రాంతాల్లో నిశ్శబ్ద వాతావరణం
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు మెరుగయ్యాయి. సీఏఏ అనుకూల, వ్యతికేక వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. పౌరులు రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా తిరగడం, సమావేశాలు ఏర్పాటు చేయడంపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పారా మిలటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు.
అదే సమయంలో ప్రజలు ఉద్యోగాలు, కార్యాలయాలకు వెళ్తున్నారని, ట్రాఫిక్ కూడా సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లర్లలో కాలిపోయిన కార్లు, ఇతర వాహనాలతో పాటు రోడ్లపై పోగైన చెత్తను భారీ క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో తొలగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోగైన చెత్త, శిథిలాలను ఈశాన్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు తొలగించిందని హోం శాఖ తెలిపింది.
హింస కారణంగా అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతాలు నిశ్శబ్దంగా ఉన్నాయని అంటున్నారు. కాగా, అల్లర్ల కారణంగా 42 మంది చనిపోగా, వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే. అలాగే, వందలాది దుకాణాలు, వాహనాలు, ఇళ్లను ఆందోళనకారులు తగుల బెట్టారు.