Mortaza: సిగ్గుపడుతున్నారా? అన్న ప్రశ్నకు సీరియస్ గా బదులిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
- పేలవ ఫామ్ లో ఉన్న మొర్తజా
- గత ఎనిమిది మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ తీసిన బంగ్లా సారథి
- ఫామ్ పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై మొర్తజా రుసరుసలు
బంగ్లాదేశ్ సారథి మష్రఫే మొర్తజా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో చిర్రుబుర్రులాడాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత మొర్తజా సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల్లో పేలవంగా బౌలింగ్ చేయడాన్ని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. "గత ఎనిమిది వన్డే మ్యాచ్ ల్లో ఒకే ఒక వికెట్ తీశారు కదా, అందుకు సిగ్గుపడుతున్నారా?" అంటూ అడిగాడు. దాంతో మొర్తజా తీవ్రంగా మండిపడ్డాడు.
"నేనేమైనా దొంగనా సిగ్గుపడడానికి? వికెట్లు తీయలేకపోతే సిగ్గుపడాలా? సరిగా బౌలింగ్ చేయకపోతే ఇతరులు, అభిమానులు విమర్శిస్తారు... అంతేకానీ, నేనెందుకు సిగ్గుపడాలి? నేను బాగా ఆడకపోతే తీసేయడానికి క్రికెట్ బోర్డు ఉంది. దొంగతనాలు, మోసాలు చేసేవాళ్లు సిగ్గుపడాలి. అయినా నేనేమైనా క్రికెట్ స్టేడియాన్ని ఎత్తుకెళ్లానా? లేక, వేరే దేశం తరఫున ఆడుతున్నానా?" అంటూ ఆ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డాడు.