Eatala Rajender: కరోనా బారిన పడిన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గురించి చెప్పిన మంత్రి ఈటల
- హైదరాబాదులో కరోనా బాధితుడు
- అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
- అధికారులతో సమావేశం నిర్వహించిన ఈటల
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లాడని తెలిపారు.
"కంపెనీ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడి సిబ్బందితో కలిసి పనిచేశాడు. తిరిగి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. జ్వరం రావడంతో చికిత్స పొందాడు. జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పుణే ల్యాబ్ కు పంపితే కరోనా ఉన్నట్లు తేలింది. కరోనా కేసు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాం.
ఇక ప్రస్తుతం ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పరిస్థితి నిలకడగా ఉంది. ఆ యువకుడు గత ఐదు రోజులుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడు. యువకుడి కుటుంబ సభ్యులు, సహచరుల వివరాలు తీసుకున్నాం. యువకుడు ఓ బస్సులో 27 మందితో ప్రయాణించినట్టు తెలిసింది. యువకుడు సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతడికి చికిత్స అందించిన సిబ్బంది వివరాలు కూడా తీసుకున్నాం. ఆ యువకుడు గాంధీ ఆసుపత్రిలో నిన్న చేరాడు. అతడు వెళ్లిన ప్రాంతాల్లో 80 మందిని గుర్తించాం. అయితే వారందరికీ వైరస్ ఉన్నట్టు కాదు" అంటూ ఈటల వివరించారు.