Rahul Gandhi: కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి హితవు పలికిన రాహుల్ గాంధీ
- భారత్ లో కరోనాపై ఆందోళన
- సోషల్ మీడియా అకౌంట్లతో విదూషకుడిలా వ్యవహరించొద్దంటూ రాహుల్ విసుర్లు
- ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టి నిలపాలని సూచన
కరోనా వైరస్ భారత్ పై ప్రభావం చూపుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తప్పుబట్టారు. 'భారత్ ఓ అత్యవసర స్థితి ముంగిట నిలిచిన తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లతో విదూషకుడిలా వ్యవహరిస్తూ దేశ ప్రజల సమయాన్ని వృథా చెయ్యడం మానేయండి' అంటూ సలహా ఇచ్చారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతి భారతీయుడ్ని సన్నద్ధం చేయడంపై దృష్టి నిలపండి అంటూ హితవు పలికారు.
అంతేకాదు, కరోనా ప్రబలుతుండడంపై సింగపూర్ ప్రధాని తమ దేశ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నాడో చూడండి అంటూ ఓ వీడియోను కూడా రాహుల్ పోస్టు చేశారు. ప్రతి దేశాధినేతకు పరిస్థితులు కొన్నిసార్లు పరీక్ష పెడతాయని, అయితే, నిజమైన నేత సమస్యను ఎదుర్కోవడంపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాడని రాహుల్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.