Mask: కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్‌లో మాస్కుల ధరలకు రెక్కలు
- కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్న వ్యాపారులు
- రూ.1.60 విలువైన మాస్క్ రూ.25
- జనరిక్ షాపుల్లోనూ ఇదే తీరు
హైదరాబాద్‌లో ఇప్పుడు మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం, అధికారులు అప్రమత్తం కావడంతో మాస్కులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వైరస్ సోకకుండా వుండడానికి మాస్కులు ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్కులకు ఎగబడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మందుల దుకాణదారులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.
హోల్‌సేల్‌లో రూ.1.60 విలువ చేసే రెండు లేయర్ల మాస్కును ఇప్పుడు రూ.20-25 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తుండగా, రూ.30-40 విలువ చేసే ఎన్95 మాస్క్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. మాస్కులకు ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద వీటికి మరింత డిమాండ్ ఉంది.
ఇక, అత్యంత చవగ్గా ఔషధాలు లభించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్కుల ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్కో మాస్కును రూ. 15-20 మధ్య విక్రయిస్తున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ రూ.160 ఉంటే, ఇప్పుడది ఏకంగా రూ.1600కు పెరగడం గమనార్హం.