Corona Virus: హైదరాబాదులో కరోనా ఎలర్ట్.. స్కూల్ ప్రార్థన సమయంలో విద్యార్థులకు అవగాహన!
- హైదరాబాద్ జిల్లా డీఈఓ ఆదేశాలు
- బాధిత యువకుడి పరిసర పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
- 61 పాఠశాలల విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న వార్తల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. రాజధాని జిల్లా పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ప్రార్థనా సమయంలో కరోనాపై అవగాహన కల్పించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా బాధిత యువకుడు వుండే చుట్టుపక్కల పాఠశాలలపై మరింత దృష్టి పెట్టింది. నిన్న ఆ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేసిన అధికారులు మొత్తం 61 పాఠశాలలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించారు.
'వైరస్ సోకకుండా ఏం చేయాలి అన్నది తెలియజేయాలనుకున్నాం. ఈ రోజు ఉదయం నుంచి దీన్ని అమలు చేయాలని కోరాం. భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్లకు వెళ్లి వచ్చాక కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అంశాలు ప్రార్థన సమయంలో తెలియజేయాలి అని ఆదేశించాం' అంటూ డీఈఓ బి.వెంకటనర్సమ్మ తెలిపారు.
విద్యార్థులను అప్రమత్తం చేయడం ద్వారా వారి తల్లిదండ్రుల్లోనూ అవగాహన పెంచినట్టవుతుందని ఆమె చెప్పారు. అలాగే కోఠి పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులను నీలోఫర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరు పాఠశాలకు గైర్హాజరవుతుండడంతో ఉపాధ్యాయులు ఆరాతీశారు. జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి ఆసుపత్రికి తరలించారు.