Corona Virus: రూపాయిన్నర మాస్క్ రూ. 50కి... హైదరాబాద్ లో పెరిగిన డిమాండ్!
- మాస్క్ లను బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యాపారులు
- ఎన్ 95 మాస్క్ ధర ఏకంగా రూ. 600
- కరోనా వ్యాప్తి కాకుండా చర్యలు
- యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నామన్న ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాలను కరోనా భయం పట్టుకున్న వేళ, ముఖానికి ధరించే మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. మెడికల్ షాపుల యజమానులు తమ వద్ద ఉన్న మాస్క్ లను బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలు పెరిగాయి. సాధారణంగా రూ. 1.50 నుంచి రెండు రూపాయలు ఉండే మాస్క్ ను ఇప్పుడు రూ. 50కి అమ్ముతున్న పరిస్థితి. 100 మాస్క్ ల ప్యాక్ రూ. 140 కాగా, ఇప్పుడు దాన్ని రూ. 1000కి విక్రయిస్తున్నారు.
ఇక క్వాలిటీ అధికంగా ఉండే ఎన్ 95 మాస్క్ ధర రూ. 40 కాగా, ఇప్పుడు ఏకంగా రూ. 600కు విక్రయిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ గార్డుల ధరలకూ రెక్కలు వచ్చాయి. రూ. 40కి విక్రయిస్తున్న స్క్రీన్ గార్డులను ఇప్పుడు రూ. 80 నుంచి రూ. 100 మధ్య అమ్ముతున్నారు. పలు మెడికల్ షాపుల్లో మాస్క్ ల స్టాక్ లేదన్న బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కరోనాకు ముందు కిలో చికెన్ ధర రూ. 200కు పైగా ఉండగా, ఇప్పుడు ధర రూ. 120కి పడిపోయింది. అయినా కొనేవారు కనిపించడం లేదని మాంసం విక్రయదారులు వాపోతున్నారు.
ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను శుభ్రపరుస్తున్నామని వెల్లడించింది. జనసమ్మర్థం అధికంగా ఉండే మాల్స్, సినిమా హాల్స్ లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వాటి యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకూ కరోనాకు వైద్యం చేసే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఆసుపత్రులు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసుకోవచ్చని పేర్కొంది.