Vijay Sai Reddy: 'కరోనా'పై పార్లమెంటులో ఏపీ ఎంపీల ప్రశ్నలు
- పార్లమెంటులో మాట్లాడిన విజయసాయిరెడ్డి, గల్లా జయదేవ్
- కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన వాక్సిన్ కావాలి
- ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయో వివరించాలి
భారత్‌లో కరోనా వ్యాప్తిపై రాజ్యసభలో ఈ రోజు చర్చ జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 29 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన వాక్సిన్ కోసం దేశంలో ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, కరోనా వైరస్‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల దేశం ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఇదే అంశంపై మాట్లాడుతూ... దేశంలో పూణెలో మాత్రమే వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఉందని, ఇది సరిపోదని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు ఉండాల్సిన అవసరముందని చెప్పారు.