KCR: మీటింగ్ మధ్యలో జగన్ కు ఫోన్ చేసిన కేసీఆర్!
- తమిళనాడు మంత్రులతో సమావేశం
- మంచి నీటిని పంపించాలని కోరిన మంత్రులు
- జగన్ తో మాట్లాడి హామీ ఇచ్చిన కేసీఆర్
మంచినీటి ఎద్దడితో సతమతమవుతున్న తమిళనాడుకు నీరివ్వాలంటూ, ఆ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం, కేసీఆర్ తో చర్చలు జరుపుతున్న వేళ, ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించిన కేసీఆర్, నీరు ఇవ్వడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అన్నారు.
ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలసిరావాల్సి వుందని అంటూ, తమిళనాడు ప్రతినిధులతో సమావేశం మధ్యలోనే జగన్ కు ఫోన్ చేశారు. తమిళనాడుకు నీరు ఇచ్చే విషయమై మాట్లాడేందుకు ఫోన్ చేశానని, వారి కోరికను మన్నిద్దామని కేసీఆర్ చెప్పగా, జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు.
కాగా, ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు మంత్రులు డీ జయకుమార్, వేలుమణి, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి కే మణివాసన్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రానికి మంచి నీరు కావాలని సీఎం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకూ అధికారికంగా లేఖలను పంపించాలని కేసీఆర్ సూచించారు. మూడు రాష్ట్రాల అధికారులనూ సమన్వయ పరుస్తూ నిపుణుల స్థాయిలో సమావేశం నిర్వహణకు తేదీని నిర్ణయిద్దామని చెప్పారు. అధికారులు ఏకాభిప్రాయానికి వస్తే, తుది నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ అన్నారు. ఒకసారి కార్యాచరణ సిద్ధమైతే మూడు దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.