Corona Virus: వాతావరణం చల్లగా ఉండడానికి, కరోనా వ్యాప్తికి సంబంధం లేదు: ఐసీఎంఆర్

ICMR says no links to corona virus with cold weather

  • చల్లటి వాతావరణంలో కరోనా విజృంభిస్తుందని ప్రచారం
  • అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్న ఐసీఎంఆర్
  • బాధితులతో సన్నిహితంగా ఉండడం వల్లే వస్తుందని వెల్లడి

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ సహా అనేక దేశాల్లో ఉనికి చాటుకుంటోంది. చైనాలో వేలాదిమందిని కబళించడంతో కరోనా అంటే ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. అయితే చల్లటి వాతావరణంలో కరోనా మరింతగా విజృంభిస్తుందన్న ఒక వాదన తెరపైకి వచ్చింది. దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వివరణ ఇచ్చింది.

ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ కాదని, కరోనా బాధితులతో కరచాలనం చేయడం, వారి తుమ్ములు, దగ్గుల నుంచి వచ్చే తుంపర్లు నేరుగా శరీరంపై పడడం కారణంగా దీని బారినపడతారని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు. వాతావరణ మార్పులకు, కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా మరింత విస్తృతమవుతుందనడానికి ఎలాంటి నిరూపణలు లేవని అన్నారు.

అటు, చైనాయేతర దేశాల్లో కరోనా ప్రబలుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా వెలుపల ఇతర దేశాల్లో కరోనా వైరస్ 17 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలకు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News