Kala Venkatrao: రాష్ట్రంలో 'దొంగరాముడు' సినిమా చూపిస్తున్నారు: కళా వెంకట్రావు
- కొత్త పథకాలు ఒక్కటీ రాలేదన్న కళా
- పాత పథకాలు తీసేశారని విమర్శలు
- రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలయ్యాక సీఎం జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు తప్ప బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తనపై ఏదైనా కేసు ఉంటే న్యాయవాదుల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇవాళ బీసీలు రిజర్వేషన్ల కారణంగా 16 వేల పదవులు కోల్పోతుంటే మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఎన్నికల హామీల విషయంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు.
"రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు ఇవ్వడంలేదు. పెళ్లికానుకలకు అదే గతి పట్టించారు. ఏపీలో 'దొంగరాముడు' సినిమా చూపిస్తున్నారు. అందులో ఓ మహిళ... ఇదే కూర అనుకో, ఇదే చారు అనుకో, ఇదే పెరుగు అనుకో నాయనా అంటుంది. అప్పుడు కథానాయకుడు ఆమె చేతిలో ఓ పావలా ఉంచి, ఇదే అర్థరూపాయి అనుకో, ఇదే రూపాయి అనుకో అంటూ వెళ్లిపోతాడు. రాష్ట్రంలో జరుగుతోంది కూడా ఇదే. కొత్తగా ఒక్క పథకం కూడా రాలేదు సరికదా ఉన్న పథకాలు తీసివేశారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతాం" అంటూ వెల్లడించారు.