YES Bank: ఎస్ బ్యాంకు సంక్షోభంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వ్యవస్థాపకుడు
- 2019లో ఎస్ బ్యాంకులో తన చివరి వాటా అమ్మేసిన రాణా కపూర్
- బ్యాంకుతో ఇప్పుడు తనకు సంబంధాల్లేవని వెల్లడి
- బ్యాంకులో ఇంత జరుగుతోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వైనం
కేవలం పదేళ్లలో రూ.3.4 లక్షల కోట్ల విలువతో తారాపథానికి ఎగిసిన ఎస్ బ్యాంకు, ఇప్పుడు నిలువునా కుంగిపోయింది. ఎస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడం దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ డిపాజిట్లు ఏమైపోతాయోనన్న అనిశ్చితి వారిలో అంతకంతకు పెరుగుతోంది. డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడించడం వారికి కాస్త ఊరట అని చెప్పాలి.
ఈ నేపథ్యంలో, ఎస్ బ్యాంకు వ్యవస్థాకుడు, ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎస్ బ్యాంకు పరిస్థితుల గురించి వింటుంటే విస్మయం కలుగుతోందని అన్నారు. ఎస్ బ్యాంకులో తన చివరి వాటాను 2019 నవంబరులో అమ్మేశానని, అంతకుముందు నుంచే తనకు సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఎస్ బ్యాంకులో ఇంత జరుగుతోందన్న విషయం తనకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.