Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పొత్తుపై జేపీ నడ్డాతో వివరంగా మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్
- ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన జనసేన నేతలు
- స్థానిక సంస్థల ఎన్నికలపై నడ్డాతో వివరంగా చర్చించాం
- ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ప్రస్తావించామన్న పవన్
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. ఢిల్లీలో ఆయన్ని కలిసిన అనంతరం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, ఎవరెన్ని స్థానాల్లో బరిలోకి దిగాలన్న విషయాలపై వివరంగా మాట్లాడుకున్నట్టు చెప్పారు.
అనంతరం, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలనే విషయమై చాలా లోతుగా చర్చించామని అన్నారు. స్థానికంగా ఏ విధంగా పోటీ చేయాలనే దానిపై ఈ నెల 8వ తేదీన విజయవాడలో జనసేన, బీజేపీ నాయకులు సమావేశమై చర్చిస్తామని చెప్పారు.
జనసేన–బీజేపీ పొత్తును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, చక్కటి ప్రణాళిక మేరకు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇరుపార్టీలు కలిసి మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఏపీ ప్రజలకు మంచి ప్రత్యామ్నాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మంచి కార్యాచరణతో ముందుకెళ్లాలని, ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు ఇరుపార్టీలు కలిసి పని చేసుకోవాలని ఈ భేటీలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు వివరించారు.