Local body: ఏపీలో మోగిన 'స్థానిక' నగారా.. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
- 21న ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికలు...23న మున్సిపాలిటీ
- 27, 29వ తేదీల్లో పంచాయతీ పోలింగ్
- అమల్లోకి ఎన్నికల నియమావళి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మొత్తమ్మీద ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ రోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకటించారు.
ఆ మేరకు... ఈ నెల 21న జరగనున్న ఎంపీటీసీ జెడ్సీటీసీ ఎన్నికల కోసం 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 14 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపాలిటీలకు మార్చి 23న ఎన్నికలు నిర్వహించి 27న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇక, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 15వ తేదీన విడుదలవుతుంది. 17 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికలకు 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 19 నుంచి 21వ తేదీ మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.