Kerala: కేరళలో ఉమెన్స్ డే స్పెషల్... అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా ఎస్సైలకు బాధ్యతలు
- మహిళా సాధికారత చాటేందుకు కేరళ సర్కారు నిర్ణయం
- ఉమెన్స్ డే సందర్భంగా కీలక వ్యవస్థల్లో మహిళలకు బాధ్యతలు
- మహిళా ఎస్సైలు లేకపోతే సీనియర్ మహిళా పోలీసులకు బాధ్యతలు
- సీఎం ఎస్కార్ట్ గా మహిళా కమాండర్లు
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఆ రోజున పోలీస్ స్టేషన్ల నిర్వహణ నుంచి రైళ్లు నడపడం వరకు అన్ని బాధ్యతలు మహిళలకు అప్పగించాలని తీర్మానించింది. కేరళ రాష్ట్ర డీజీపీ లోక్ నాథ్ బెహరా ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
మహిళా దినోత్సవం నాడు అత్యధిక సంఖ్యలో పోలీసు స్టేషన్లలో మహిళా ఎస్సైలకు బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు. ఇతర స్టేషన్లలో మహిళా ఎస్సైలు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో సీనియర్ మహిళా పోలీసులకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు. ఆ రోజున ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, కేసుల పరిష్కారం అన్నీ మహిళా పోలీసు అధికారులే చూసుకుంటారని డీజీపీ వెల్లడించారు.
అంతేకాదు, మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి వాహన ఎస్కార్ట్ బాధ్యతలను మహిళా కమాండర్లకు అప్పగిస్తున్నారు. దాంతోపాటే, వేనాడ్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా మహిళా లోకో పైలెట్లనే నియమించనున్నారు. ఆ రోజున ట్రైన్ పైలెట్లతో పాటు పాయింట్స్ మన్, గేట్ కీపర్, ట్రాక్ సిబ్బంది అందరూ మహిళలే ఉంటారని కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.