Uddhav Thackeray: అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ప్రకటించిన ఉద్ధవ్ థాకరే
- బీజేపీకి మాత్రమే దూరమయ్యాం.. హిందుత్వకు కాదు
- బీజేపీ అంటే హిందుత్వ కాదు
- మహరాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి రూ. కోటి ఇస్తాం
బీజేపీకి మాత్రమే శివసేన దూరమయిందని, హిందుత్వకు తాము దూరం కాలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఒక కోటి రూపాయల విరాళం ఇస్తామని ప్రకటించారు. సీఎం అయిన తర్వాత థాకరే ఈరోజు తొలిసారిగా అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అంటే హిందుత్వ కాదని చెప్పారు. హిందుత్వ అనేది మరో అంశమని... దీంతో తాము విడిపోలేదని అన్నారు.
2018 నవంబర్ లో తాను అయోధ్యకు వచ్చినప్పుడు... రామాలయ నిర్మాణానికి సంబంధించి సందిగ్ధత ఉందని థాకరే చెప్పారు. 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిందని, ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... ఇదే సమయంలో తాను సీఎం కూడా అయ్యానని తెలిపారు. అయోధ్యకు తాను రావడం ఇది మూడోసారి అని... ఇక్కడకు ఎప్పుడొచ్చినా శుభమే జరుగుతుందని చెప్పారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో నిన్న తాను మాట్లాడానని, రామ మందిర నిర్మాణం కచ్చితంగా జరుగుతుందని... అయితే మందిర నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఇతర రామభక్తులకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయనను తాను కోరానని థాకరే తెలిపారు. మందిర నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయల విరాళం ఇస్తుందని చెప్పారు.