Narendra Modi: మోదీ, మీరే నా దేవుడన్న మహిళ... భావోద్వేగం చెందిన ప్రధాని!
- పక్షవాత బాధితురాలితో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- ప్రభుత్వ పథకం తనను ఆదుకుందన్న మహిళ
- ఖరీదైన వైద్యం చేయించుకోలేని తనకు అదే ఆదరువు అయ్యిందన్న మహిళ
- చలించిపోయిన మోదీ
ఓ మహిళ వ్యాఖ్యలతో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగాలకు లోనయ్యారు. డెహ్రాడూన్ కు చెందన దీపా షా జన ఔషధి పరియోజన పథకం లబ్దిదారు. ఆమెకు ఈ పథకం కింద పక్షవాతం జబ్బుకు మందులు తక్కువ ధరకే ప్రభుత్వం అందజేస్తోంది. దీనిపై ఆమె ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
"నాకు తొమ్మిదేళ్ల కిందట పక్షవాతం వచ్చింది. దాంతో మాట పడిపోయింది. ఆసుపత్రిలో చేర్చినా వైద్యం, ఔషధాలు ఎంతో ఖరీదైనవి కావడంతో తట్టుకోలేకపోయాం. ఓ దశలో డాక్టర్లు బతకనని చెప్పారు. ఆశలు కూడా వదిలేసుకున్నాం. అయితే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం ద్వారా నాకు ఎంతో లబ్ది చేకూరింది. ఈ పథకం ద్వారా నాకు ఇప్పుడు మందుల ఖర్చు కేవలం రూ.1500 మాత్రమే. ఇంతకుముందు రూ.5 వేల వరకు ఖర్చయ్యేది. డబ్బుకు ఇబ్బంది కలగడంతో బలమైన ఆహారం కూడా తీసుకోలేకపోయాను. ఇప్పుడు మూడు వేలకు పైగా మిగులుతుండడంతో మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యం పొందుతున్నాను.
ఇప్పుడు నేను కోలుకుంటున్నానంటే అందుకు కారణం మోదీ గారే. నేనెప్పుడూ దేవుడ్ని చూడలేదు, మోదీ గారూ మీరే నా దేవుడు. మీరే నన్ను బతికించారు. జనరిక్ మందుల కారణంగా నా వైద్య ఖర్చులు బాగా తగ్గాయి. మీకు కృతజ్ఞురాలినై ఉంటాను" అంటూ భావోద్వేగభరితంగా మాట్లాడారు. దీపా షా మాటలకు ప్రధాని మోదీ చలించిపోయారు. ఆమె పరిస్థితికి కదిలిపోయిన ఆయన భావోద్వేగానికి గురవడంతో ఆయన కళ్ళు చెమర్చాయి. అంతటి కష్టాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న తీరును మనస్ఫూర్తిగా అభినందించారు.