- మొత్తంగా 124కు చేరిన మృతుల సంఖ్య
- అందులో ఏడుగురు ప్రజాప్రతినిధులే..
- ఆ దేశంలో ఇప్పటివరకు 4,747 మందికి వైరస్
ఇరాన్ లో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా శనివారం ఆ దేశానికి చెందిన మరో ఎంపీ ఫాతిమా రహ్బార్ (55) చనిపోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఆమె పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ మరో ఎంపీ మహమ్మద్ అలీ రమజానీ కూడా వైరస్ కారణంగా చనిపోయారు.
4,747 మందికి వైరస్..
కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలో వైరస్ నియంత్రణలోకి వస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రం తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఇరాన్ లో రోజురోజుకు పరిస్థితి విషమంగా మారుతోంది. ఇక్కడ ఇప్పటివరకు 4,747 మందికి కరోనా వైరస్ సోకగా.. 124 మంది మృతి చెందారు. ఇరాన్ లో ఇప్పటికే యూనివర్సిటీలు, పాఠశాలలు మూసివేశారు. ప్రజలు గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం విధించారు.
ఏడుగురు ప్రజాప్రతినిధులే..
ఇరాన్ లో సాధారణ జనమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు కూడా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే ఏడుగురు ప్రజాప్రతినిధులు కరోనాతో చనిపోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు.