Narendra Modi: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పై స్పందించిన మోదీ
- ఆఖరి అంకానికి చేరిన మహిళల టి20 వరల్డ్ కప్
- రేపు మెల్బోర్న్ లో ఫైనల్ మ్యాచ్
- టైటిల్ పోరు కోసం అమీతుమీకి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా
- ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- అత్యుత్తమ జట్టే గెలుస్తుందని వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నివారాలుగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. రేపు మెల్బోర్న్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మెరుగైన జట్టే విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
"విజయం ఎప్పుడూ అత్యుత్తమ జట్టునే వరిస్తుంది. రేపు జరిగే మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్ ను మించిన విశేషం ఇంకేమీ ఉండదు. టీమిండియా, ఆస్ట్రేలియా మహిళలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇరు జట్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ విషెస్ తెలిపారు. అయితే, అత్యుత్తమ జట్టే గెలుస్తుందంటూనే నీలి పర్వతాల మాదిరిగా రేపు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం నీలివర్ణం సంతరించుకుంటుందని వ్యాఖ్యానించడం ద్వారా తాను గెలవాలని కోరుకుంటున్నది టీమిండియానే అని చెప్పకనే చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చేసిన ఓ ట్వీట్ కు బదులుగా మోదీ పైవిధంగా స్పందించారు.