India: ఫైనల్లో చేతులెత్తేసిన టీమిండియా టాపార్డర్... మిగిలినవాళ్లపైనే భారం!
- వరల్డ్ కప్ ఫైనల్లో కష్టాల్లో భారత్
- 185 పరుగుల చేజింగ్ లో 58 పరుగులకే 5 వికెట్లు డౌన్
- విఫలమైన షెఫాలీ, స్మృతి, హర్మన్ ప్రీత్
మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత అమ్మాయిల జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా జట్టుపై 185 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ దారుణంగా విఫలమైన నేపథ్యంలో, మిడిల్, లోయరార్డర్ బ్యాట్స్ ఉమెన్ పైనే భారం నిలిచింది. ఈ టోర్నీలో దాదాపు ప్రతిమ్యాచ్ లో ధాటిగా ఆడిన ఓపెనర్ షెఫాలీ వర్మ (2) విఫలం కావడం టీమిండియా ఛేజింగ్ పై పెను ప్రభావం చూపింది. ఏ దశలోనూ భారత అమ్మాయిలు పరిస్థితికి తగ్గట్టుగా ఆడలేకపోయారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధన 11 పరుగులు చేసి నిరాశపరిచింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన పేలవ ఫామ కొనసాగిస్తూ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జొనాస్సెన్ బౌలింగ్ లో వెనుదిరిగింది. వేగంగా ఆడే జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కావడంతో టీమిండియా అవకాశాలను దెబ్బకొట్టింది. వికెట్ కీపర్ తాన్య రిటైర్డ్ హర్ట్ కాగా, వేదా 19 పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా మహిళల స్కోరు 13 ఓవర్లలో 5 వికెట్లకు 67 పరుగులు. దీప్తి శర్మ (17), రిచా ఘోష్ (7) క్రీజులో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 42 బంతుల్లో 118 పరుగులు చేయాలి.