Australia: మహిళల టి20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా.... దారుణంగా ఓడిన టీమిండియా
- 185 పరుగులు చేజింగ్ లో భారత్ అమ్మాయిలు 99 ఆలౌట్
- 19.1 ఓవర్లలో కుప్పకూలిన టీమిండియా
- దీప్తి శర్మ (33) టాప్ స్కోరర్
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను అన్నిరంగాల్లో చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకున్నారు. మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ 85 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టుపై విజయభేరి మోగించింది. 185 పరుగుల లక్ష్యం అందుకునే క్రమంలో భారత్ అమ్మాయిలు 99 పరుగులకే ఆలౌటయ్యారు. లక్ష్యఛేదనలో ఏ దశలోనూ విజయం దిశగా వెళుతున్నట్టు కనిపించని టీమిండియా 19.1 ఓవర్ల వద్ద తన ప్రస్థానం ముగించింది.
మిడిలార్డర్ లో దీప్తి శర్మ చేసిన 33 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్టార్లుగా భావించిన అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి (19), రిచా ఘోష్ (18) ఓ మోస్తరు పోరాటం కనబర్చడంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మేఘాన్ షట్ 4, జొనాస్సెన్ 3 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం ద్వారా ఆతిథ్య ఆస్ట్రేలియా సగం మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అలిస్సా హీలీ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. హీలీ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 75 పరుగలు చేసింది. మరో ఓపెనర్ మూనీ చివరికంటా క్రీజులో నిలిచి 54 బంతుల్లో 78 పరుగులు సాధించింది. మూనీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి.
ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆరంభంలోనే హీలీ, మూనీ ఇచ్చిన క్యాచ్ లు వదిలేయడం ద్వారా టీమిండియా అమ్మాయిలు ఏకంగా కప్పునే చేజార్చుకున్నారని చెప్పాలి. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఐదోసారి టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఆసీస్ మహిళలు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఆరుసార్లు ఫైనల్ చేరుకోగా ఒక్క పర్యాయం మాత్రమే ఓటమిపాలయ్యారు.