Bonda Uma: వైసీపీకి ఓటేస్తేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు: బోండా ఉమ
- ఏపీలో రగులుకుంటున్న స్థానిక సంస్థల ఎన్నికలు
- వలంటీర్లతో ఓటరు స్లిప్పులు, డబ్బు పంచుతున్నారని ఉమ ఆరోపణ
- అధికారుల సాయంతో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం
ఏపీలో స్థానిక సంస్థల కోలాహలం మొదలైంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు సన్నాహాలు షురూ చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామ వలంటీర్లతో ఓటరు స్లిప్పులు, డబ్బు పంచుతున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారని, తద్వారా వైసీపీకే ఓటేయాలని వలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అధికారులను ఉపయోగించుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు బనాయిస్తూ టీడీపీ నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు.