Amrutha: నా వల్లే మారుతీరావు చనిపోయాడంటే అంగీకరించను: అమృత

Amrutha Comments on her Father Maruti Rao

  • ఇంట్లో ఆస్తి గొడవలు ఉన్నాయి
  • వాటివల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు
  • నాలో భావోద్వేగాలు కలగడం లేదు
  • పరిస్థితులు అంగీకరిస్తే, వెళ్లి చూసొస్తానన్న అమృత

తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు తానే కారణమంటే అంగీకరించేది లేదని ఆయన కుమార్తె అమృత స్పష్టం చేసింది. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసునని, వాటివల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, అల్లుడిని చంపించానన్న పశ్చాత్తాపం కూడా వెంటాడి వుంటుందని పేర్కొంది. ఎప్పుడైతే తన భర్తను హత్య చేయించారో, ఆ క్షణం నుంచి తనకు ఆయనపై ప్రేమ చచ్చిపోయిందని, ఇప్పుడు తనలో ఎటువంటి భావోద్వేగాలూ కలగడం లేదని వెల్లడించింది. తనకు తండ్రిని చివరి సారిగా చూడాలని మాత్రం ఉందని, అందుకు పరిస్థితులు అనుకూలిస్తే, వెళ్లి వస్తానని తెలిపింది.

ఇదిలావుండగా, సోషల్ మీడియాలో అమృతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిపై ప్రేమ లేకున్నా, కన్న తల్లిపై కనికరం ఉన్నా, ఈ పాటికి ఆమె ఇంటికి వెళ్లి, తల్లికి తోడుగా ఉండేదని కామెంట్లు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అమృత, తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడని వారు, ఇప్పుడు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడింది. 

కాగా, మిర్యాలగూడలో మారుతీరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శ్రవణ్ తలకొరివి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మారుతీరావు ఇంటివద్ద, అమృత ఇంటివద్ద బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, ఈ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసేందుకు చూస్తున్నారు. మరోవైపు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు పట్టణ ప్రముఖులు తరలి వచ్చారు. కుమార్తెపై ఉన్న వల్ల మాలిన ప్రేమే, ఓ మంచి వ్యక్తిని ఈ స్థితికి చేర్చిందని పలువురు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News