Infosys: ఆదాయపుపన్ను ఫ్రాడ్ కేసులో ముగ్గురు ఇన్ఫోసిస్ ఉద్యోగుల అరెస్ట్
- ఆదాయపు పన్ను చెల్లించే వారితో సంప్రదింపులు
- 4 శాతం రిబేట్ ఇప్పిస్తామంటూ ఆఫర్
- ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాక్స్ రిబేట్లు ఇప్పిస్తామంటూ ఐటీ చెల్లించే వారిని సంప్రదించి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారి శ్రీనాథ్ మహదేవ్ మీడియాతో మాట్లాడుతూ, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మొత్తంలో 4 శాతం రిబేట్ ఇప్పిస్తామని వీరు ముగ్గురూ ట్యాక్స్ చెల్లించేవారిని సంప్రదించారని చెప్పారు. వీరిని రేణుగుంట కల్యాణ్ కుమార్, ప్రకాశ్, దేవేశ్వర్ రెడ్డిలుగా గుర్తించామని తెలిపారు. స్థానిక కోర్టు వీరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిందని చెప్పారు.
ఆదాయపు పన్ను శాఖకు, ఇన్ఫోసిస్ కు ఉన్న ఓ కాంట్రాక్టు దరిమిలా వీరు ఐటీశాఖ పనులు చేసేవారనీ, ఆ సమయంలో వీరికి వచ్చిన సమాచారాన్ని ముందుగానే ఆయా పన్ను చెల్లింపుదారులతో పంచుకుని, రిబేట్ కు సంబంధించి మాట్లాడుకునే వారని తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు వివరాలను ఫార్వర్డ్ చేసేవారని... ట్యాక్స్ అసెస్ మెంట్ చేయించేవారని వెల్లడించారు. నెల రోజులుగా వీరు ఫ్రాడ్ కు పాల్పడుతున్నారని, చట్ట విరుద్ధ కార్యకలాపాలతో రూ. 4 లక్షలు అక్రమంగా సంపాదించారని చెప్పారు. ఆ మొత్తాన్ని వీరి నుంచి రికవర్ చేసుకున్నామని తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది.