IPL: ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా వేయాలనుకుంటున్న మహా సర్కారు... జరిగి తీరుతాయంటున్న గంగూలీ
- దేశవ్యాప్తంగా తొలగని కరోనా భయాలు
- ఐపీఎల్ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చన్న మహారాష్ట్ర ప్రభుత్వం
- కట్టడికి చర్యలు తీసుకుంటామన్న గంగూలీ
- మ్యాచ్ లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా జనసమూహాలు స్టేడియానికి తరలిస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుందని, అందుకే తమ రాష్ట్రంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నామని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో 15 మంది అనుమానితులను ప్రత్యేక పరిశీలనలో ఉంచామని వెల్లడించారు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ ను ఆపబోమని తేల్చి చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్ లన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్ తో కలిపి 7 మ్యాచ్ లు ఇక్కడే జరగనున్నాయి.