Corona Virus: కరోనాపై దక్షిణాఫ్రికా ఒకలా... ఆసీస్ మరోలా..!
- క్రీడారంగంపై కరోనా ప్రభావం
- ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోమన్న దక్షిణాఫ్రికా కోచ్
- తమకు అలాంటి భయాల్లేవన్న ఆసీస్ కోచ్
ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న కరోనా వైరస్ దెబ్బ క్రీడారంగంపైనా పడింది. ఇప్పటికే అనేక క్రీడాపోటీలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఐపీఎల్ వంటి ప్రముఖ లీగ్ ప్రారంభం అనిశ్చితిలో పడింది.
ఈ నేపథ్యంలో, భారత్ తో మూడు వన్డేలు ఆడేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో తాము కరచాలనం చేయబోమని ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ ప్రకటించాడు. వైరస్ సోకకుండా ఉండేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడు. ఆటగాళ్ల ఆరోగ్యానికి ఏది మేలనుకుంటే అదే చేస్తామని వివరించాడు. వైద్య, భద్రత సిబ్బంది సూచనల మేరకు నడుచుకుంటామని, వైరస్ పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని బౌచర్ వెల్లడించాడు.
మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అందుకు భిన్నంగా స్పందించాడు. త్వరలో ఆసీస్ జట్టు న్యూజిలాండ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో లాంగర్ మాట్లాడుతూ, ఇతరులతో తమకు సంబంధం లేదని, ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేస్తామని చెప్పాడు. తమ ఆటగాళ్ల వద్ద తగినన్ని శానిటైజర్లు ఉన్నాయని, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి భయం లేదని పేర్కొన్నాడు. అటు ఇంగ్లాండ్ జట్టు షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది.