USA: ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకోలేదు.. అవసరం కూడా లేదు: శ్వేతసౌధం
- ఆయనలో వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేసిన అధికార ప్రతినిధి
- కరోనాతో అమెరికాలో 24 మంది మృతి
- 514 మందికి సోకిన వైరస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారన్న వార్తలను శ్వేతసౌధం కొట్టిపారేసింది. ఆయన ఎలాంటి వైద్య పరీక్షలకు హాజరుకాలేదని స్పష్టం చేసింది. తమ అధ్యక్షుడిలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, అలాంటప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, వ్యక్తిగత వైద్యుడు ఆయన పరిస్థితిని ఎప్పకప్పుడు సమీక్షిస్తుంటారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రిషమ్ పేర్కొన్నారు.
అగ్రరాజ్యంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండగా, గత నెలలో డొనాల్ట్ ట్రంప్ పాల్గొన్న ఓ సమావేశానికి హాజరైన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అలాగే, కరోనా సోకిన ఇద్దరు ప్రతినిధులు కూడా పలు సమావేశాల్లో ట్రంప్‌ను కలిశారన్న వార్తలు కూడా రావడంతో శ్వేతసౌధంలో అలజడి రేపింది. అయితే, ట్రంప్‌ను కలిసిన సమయంలో వారిద్దరిలో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. అయినా డొనాల్ట్ ట్రంప్ వైద్య పరీక్షల గురించి వీలైనంత త్వరగా సమాచారం ఇచ్చేలా చూస్తామని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పడంతో ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, శ్వేతసౌధం స్పష్టత ఇవ్వడంతో ఈ విషయంలో అనుమానాలు వీడాయి.