Prashant Kishor: జ్యోతిరాదిత్య సింధియాపై ప్రశాంత్ కిశోర్ విమర్శలు
- ఇంటిపేరు వల్లే జ్యోతిరాదిత్యకు గుర్తింపు వచ్చింది
- నాయకుడిగా ఆయన ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది
- బీజేపీ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి
కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధియాపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. కేవలం సింధియా అనే ఇంటిపేరు వల్లే జ్యోతిరాదిత్యకు గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. మాస్ లీడర్ గా, పొలిటికల్ ఆర్గనైజర్ గా, అడ్మినిస్ట్రేటర్ గా ఆయన కేవలం కొంత మాత్రమే నిరూపించుకున్నారని చెప్పారు.
గాంధీల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోందని ఇప్పటి వరకు విమర్శిస్తున్నవారు (బీజేపీ)... సింధియా పేరున్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అంటున్నారని... ఇది తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. కానీ నిజం ఏమిటంటే... ఓ నాయకుడిగా జ్యోతిరాదిత్య సింధియా ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని చెప్పారు.
గ్వాలియర్ రాజకుటుంబం నుంచి జ్యోతిరాదిత్య సింధియా వచ్చారు. ఆయన కుటుంబంలో పేరుగాంచిన రాజకీయవేత్తలు ఉన్నారు. ఆయన తండ్రి దివంగత మాధవరావు సింధియా కేంద్ర మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు. మేనత్త వసుంధర రాజే సింధియా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. తండ్రి మరణం తర్వాత జ్యోతిరాదిత్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుణ నియోజకవర్గం బై ఎలక్షన్ లో ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతను నిర్వహించారు.