Local Body Polls: చిత్తూరు జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడి!
- ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు
- వెల్దుర్తిలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన దుండగులు
- మాచవరంలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కొన్నిచోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్న సమయంలో దాడులు జరిగాయి. మరికొన్ని చోట్ల నామినేషన్లు పరిశీలిస్తున్న సమయంలో వాటిని గుర్తుతెలియని వ్యక్తులు లాక్కునివెళ్లడం వంటి ఘటనలు జరిగాయి.
చిత్తూరు జిల్లాలో..
బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడికి పాల్పడింది. నామినేషన్ పత్రాల కోసం బీజేపీ కార్యకర్తలు వెళుతున్న సమయంలో పులిచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యాకర్తలకు గాయాలయ్యాయి. వారిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గుంటూరు జిల్లాలో..
వెల్దుర్తి మండలంలోని బోయలవీడులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అభ్యర్థి నాగేంద్ర నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
మాచవరంలో నామినేషన్లు వేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థులను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, దుండగులను పట్టుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు.
కర్నూలులో ..
టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రజని నామినేషన్ పత్రాలను మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చించివేశారు. ఈ ఘటనపై టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.