Eetala Rajender: తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసు లేదు: మంత్రి ఈటల
- ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ‘కరోనా’ పరీక్షలు
- శాంపిల్స్ ను పూణెకు పంపక్కర్లేదు
- ఇకపై హైదరాబాద్ లోనే టెస్టులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు స్పష్టం చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్వహించిన ‘కరోనా’ పరీక్షల్లో మొదటి రిపోర్టు ‘నెగెటివ్’ వచ్చిందని, రేపు మరోమారు ఈ వ్యక్తికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ రిపోర్టు కూడా ‘నెగెటివ్’ గానే వస్తుందని వైద్యులు భావిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి ‘కరోనా’ నయమైనట్టు తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘కరోనా’ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకూ గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ‘కరోనా’ను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేసేవాళ్లమని, ఉస్మానియా ఆసుపత్రిలో కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
‘కరోనా’ నిర్ధారణకు ఇకపై శాంపిల్స్ ను పూణెకు పంపాలని అవసరం లేదని, ఎంతమందికైనా హైదరాబాద్ లోనే టెస్టులు చేస్తామని చెప్పారు. శంషాబాద్ లో ఇప్పటి వరకూ నలభై వేల మంది ప్రయాణికులకు స్కీనింగ్ చేశారని, థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.