K. Keshava Rao: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, పొంగులేటి.. ఖరారు చేసిన కేసీఆర్!
- మండలికి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్
- నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకూ దక్కని అవకాశం
- నేడు పేర్లను ప్రకటించే అవకాశం
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి పేర్లను ఫైనల్ చేసినట్టు సమాచారం. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల నుంచి వీరిని పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం, దామోదర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి వంటి వారు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు. అయితే, చివరికి కేకే, పొంగులేటి వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
అయితే, తమ పేర్లను ఖరారు చేసినట్టు తమకు ఇంత వరకు సమాచారం లేదని కేకే, పొంగులేటి గతరాత్రి తెలిపారు. ఈ నెల 13 వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో నేడు వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, శాసనమండలిలో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.