Corona Virus: ఆ రెండు దేశాల నుంచి వచ్చిన వారు కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తేవాల్సిందే!
- లేదంటే దేశంలోకి అనుమతించమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ
- ఇటలీ, దక్షిణకొరియా ప్రయాణికులపై ఆంక్షలు
- కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయమని స్పష్టీకరణ
కరోనా వైరస్ ప్రభావంతో తీవ్రంగా సతమతమవుతున్న దక్షిణ కొరియా, ఇటలీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ దేశాల నుంచి వచ్చేవారు కరోనా లేదన్న ధ్రువపత్రం తేవాలని, లేదంటే దేశంలోకి అనుమతించేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అది కూడా గుర్తింపు ఉన్న ప్రయోగశాల ఇచ్చిన 'నెగెటివ్' ధ్రువపత్రాన్ని తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అమల్లో ఉన్న వీసా నిబంధనలకు ఇది అదనమని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో దాదాపు 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు డీజీఏసీ అధికారులు కూడా విమానాశ్రయాల్లో చర్యలు చేపట్టారు. ధ్రువపత్రం ఉన్న వారినే అనుమతిస్తున్నారు.