Bonda Uma: బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి ఘటనపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే స్పందన
- టీడీపీ నేతల వాహనం ఒక బాలుడికి తగిలింది
- దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేది టీడీపీ ప్లాన్
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమతో పాటు హైకోర్టు లాయర్ కిశోర్ లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వీరు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి కారులో వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు వచ్చిన వాహనాల్లో ఒక వాహనం ఓ బాలుడికి తగిలిందని ఆయన చెప్పారు. దీంతో, స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోందని పిన్నెల్లి ఆరోపించారు. ఇందులో భాగంగానే 10 కార్లలో వచ్చి గొడవకు దిగారని తెలిపారు. ఇదే పల్నాడు ప్రాంతంలో 2014లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి చేశారని చెప్పారు. మొన్న రైతుల ముసుగులో అమరావతిలో తనపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ ఇంత చేస్తున్నా తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.