Ananad Mahindra: నా ఉద్దేశంలో ఈ వృద్ధ మహిళ కరోనా వైరస్ ను కూడా ఓడిస్తుంది: ఆనంద్ మహీంద్రా
- నారీశక్తి అవార్డు అందుకున్న మన్ కౌర్
- మన్ కౌర్ వయసు 103 ఏళ్లు
- 93 ఏళ్ల వయసులో అథ్లెట్ గా మారిన మన్ కౌర్
- అనేక అంతర్జాతీయ పోటీల్లో పతకాలు
- కరోనాను సైతం రేసులో వెనక్కి నెట్టేస్తుందన్న ఆనంద్ మహీంద్రా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన్ కౌర్ అనే శతాధిక వృద్ధురాలిని నారీశక్తి పురస్కారంతో గౌరవించారు. 103 ఏళ్ళ మన్ కౌర్ ఇంతటి వృద్ధాప్యంలోనూ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తుండడమే అందుకు కారణం. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.
"యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆందోళన చెందుతోంది. కానీ వయో వృద్ధురాలిని మాత్రం ఆ మహమ్మారి ఏమీ చేయలేదని అనుకుంటున్నా. నా ఉద్దేశంలో... 90 ఏళ్లు పైబడిన మన్ కౌర్ కరోనా వైరస్ ను సైతం రేసులో వెనక్కినెట్టేస్తారని నమ్ముతున్నా. నిజంగా ఎంత గొప్ప స్ఫూర్తి" అంటూ వ్యాఖ్యానించారు. చండీగఢ్ కు చెందిన మన్ కౌర్ ఎన్నో ఏళ్లుగా వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. ఆమె అథ్లెట్ గా మారింది 93 ఏళ్ల వయసులో అంటే నమ్మశక్యం కాదు. ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన ఆ పంజాబీ బామ్మ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అనడంలో సందేహంలేదు.