Italy: ఇటలీలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు.. శాపంగా మారిన నిబంధన!
- రోమ్ విమానాశ్రయంలో 70 మంది విద్యార్థులు
- బోర్డింగ్ పాస్లు ఇచ్చేందుకు ఎయిర్లైన్స్ నిరాకరణ
- కరోనా వైరస్ సోకలేదని ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్న వైనం
ఇటలీలోని రోమ్ విమానాశ్రయంలో గత 24 గంటలుగా భారతీయ విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. కరోనా కోరలు చాచిన ఇటలీ నుంచి బయటపడేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్వదేశానికి వచ్చేందుకు అటు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కానీ, ఇటు ఎయిరిండియా కానీ వారికి బోర్డింగ్ పాస్లు ఇవ్వకపోవడంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.
కరోనా బాధిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్ సోకలేదని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే దేశంలోకి అనుమతిస్తామన్న భారత ప్రభుత్వ నిబంధన కారణంగా వారికి బోర్డింగ్ పాసులు ఇచ్చేందుకు విమానయాన సంస్థలు నిరాకరిస్తున్నాయి. వసతి, భోజన సదుపాయం లేకుండా విమానాశ్రయంలో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని, ప్రధాని మోదీ స్పందించి తమను స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.