Rajinikanth: పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను.. ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదు!: రజనీకాంత్ కీలక ప్రకటన
- 1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి ఆలోచించలేదు
- ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను
- రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను
- నా అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పలు అంశాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... '1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి నేను ఆలోచించలేదు. ఈ విషయంపై ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను' అని తెలిపారు.
'నేను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నాను. నా అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అన్ని ఊహాగానాలకు నేడు ఫుల్స్టాప్ పెడుతున్నాను. 2016-17లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించింది. మంచివారు రాజకీయాల్లోకి రావట్లేదు' అని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు
'వ్యవస్థను సరిచేయకుండా మార్పురావాలని కోరుకోవడం సరికాదు. నేను పార్టీ ప్రారంభిస్తున్నాను. నాకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు. నీతి, నిజాయతీ, ప్రజల మనసులో స్థానం ఉన్నవారికే సీఎం అయ్యే అర్హత ఉండాలి. నా పార్టీలో 60 నుంచి 65 శాతం వరకు యువతకే అవకాశం' అని రజనీకాంత్ చెప్పారు.
'రాజకీయాల్లో విద్య, వయసు కూడా ముఖ్యమే. నా పార్టీలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యతనిస్తాను. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు. నేను పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను. 45 ఏళ్లుగా సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయి' అని తెలిపారు.