Chandrababu: 2024లో మళ్లీ మీరే సీఎం.. అప్పటికే రాష్ట్రం నాశనమవుతుంది: చంద్రబాబుతో జేసీ
- చంద్రబాబుతో దివాకర్ రెడ్డి భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ
- మీరు మళ్లీ సీఎం అయినా చేసేది ఏమీ ఉండదని జేసీ ఆవేదన
- రాష్ట్రాన్ని నాశనం కానివ్వబోనని చంద్రబాబు వ్యాఖ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. వైసీపీకి తాను భయపడటం లేదని... అయితే కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను ఎవరిపై ఎక్కుపెడతారో తెలిసే మాట్లాడుతున్నానని చెప్పారు.
దీనికి స్పందనగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనని అన్నారు. అయితే డబ్బు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ఇవి రెండూ పంచకపోతే ఎవరూ ఓటు వేయరని జేసీ బదులిచ్చారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చదువుకున్నవారిలో మార్పు వచ్చిందని... కానీ కాయకష్టం చేసుకుని బతికేవారిలో మార్పు రాలేదని చెప్పారు. నవరత్నాలు వారికి నేరుగా అందుతున్నాయని... దాని ప్రభావం వారిపై ఉంటుందని అన్నారు.
ప్రజల్లో మార్పు వచ్చిన మాట నిజమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించగా... మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు సార్ అంటూ జేసీ చమత్కరించారు. ఇదే సందర్భంగా జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో మీరే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. అయితే అప్పటికే రాష్ట్రం నాశనం అవుతుందని... మీరు సీఎం అయినా చేసేదేమీ ఉండదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి ప్రతిస్పందనగా చంద్రబాబు మాట్లాడుతూ, తాను బతికుండగా రాష్ట్రాన్ని నాశనం కానివ్వనని అన్నారు. నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తనకు 14 సంవత్సరాలు సీఎంగా, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసే అవకాశం కల్పించారని... వారి రుణం తీర్చుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం దివాకర్ రెడ్డి బయటకు వచ్చారు. తమమధ్య జరిగిన సంభాషణను మీడియాకు వివరించారు. నిన్న సాయంత్రం చంద్రబాబు, జేసీల మధ్య భేటీ జరిగింది.