Chandrababu: మా వాళ్లు నా మాట వినడం లేదు.. కావాలంటే ఒక నెల జైల్లో ఉంటామంటున్నారు: జేసీ దివాకర్ రెడ్డి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ వద్దని చెబుతుంటే వినడం లేదు
- ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అంటున్నారు
- చంద్రబాబు కూడా ఇదే చెబుతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అనవసరమని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పోటీ చేసి డబ్బులు వదిలించుకుని, జైలుకు వెళ్లాల్సిన అవసరం మనకెందుకని ప్రశ్నించారు. నిన్న చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో పోటీ వద్దని చెపుతున్నా తమ వాళ్లు తన మాట వినడం లేదని నిట్టూర్చారు.
మా సొంత మనుషులకు కూడా చెప్పలేకపోతున్నానని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని వారు అంటున్నారని... అవసరమైతే ఒక నెల జైలుకు పోయి వస్తామని చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు కూడా ఇదే అంటున్నారని... మధ్యలో తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని జేసీ చెప్పారు. అయితే ఆ వ్యతిరేకత పతాక స్థాయికి వెళ్లడానికి మరింత సమయం పడుతుందని అన్నారు. అప్పటి వరకు టీడీపీ శ్రేణులు వెయిట్ చేయాలని సూచించారు.