JC Prabhakar Reddy: కౌన్సిలర్‌గా నామినేషన్ వేసి షాకిచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!
- తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు నామినేషన్
- జేసీ తరపున నామినేషన్ వేసిన ఆయన లాయర్లు
- అదే వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ఆయన నామినేషన్ వేశారు. ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకపోవడమే బెటర్ అని ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద కూడా ఆయన ఈ ప్రస్తావనను తీసుకొచ్చారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో, తన మాటను తన సొంత మనుషులు కూడా వినడం లేదని ఆయన నిట్టూర్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.