Hyderabad: పార్లమెంటు సమావేశాలున్నాయి... బెయిల్ ఇవ్వండి: హైకోర్టులో ఎంపీ రేవంత్ పిటిషన్
- మరో రెండు కేసులకు సంబంధించి మొత్తం మూడు పిటిషన్లు దాఖలు
- ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ నేత
- డ్రోన్ కెమెరా వినియోగం కేసులో అరెస్ట్
కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనపై ఉన్న కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. డ్రోన్ కెమెరా వినియోగించారన్న కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని, కోరుతూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రేవంత్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి న్యాయవాదులు వేసిన పిటిషన్ను ట్రయిల్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ రేవంత్ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన నేతృత్వంలోని లాయర్ల బృందం హైదరాబాద్ చేరుకుంది.